చిరంజీవి సినిమా టైటిల్‌లో తన పేరు కూడా ఉండాలని డిమాండ్ చేసిన శ్రీదేవి!
on Feb 7, 2025
1983లో చిరంజీవి, ఎ.కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖైదీ’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా స్టార్ హీరో రేంజ్‌కి వెళ్లిపోయారు చిరంజీవి. ఆ సమయంలోనే చిరంజీవి హీరోగా ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేశారు అతిలోక సుందరి శ్రీదేవి. ఆ సినిమా పేరు ‘వజ్రాలదొంగ’. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ ఈ సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసి క్లాప్ కొట్టారు. షూటింగ్ ప్రారంభమైంది. రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత దర్శకుడు కోదండరామిరెడ్డికి కథపై అనుమానం వచ్చింది. ఇది చిరంజీవి, శ్రీదేవి మీద వర్కవుట్ అయ్యే సబ్జెక్ట్ కాదని అన్నారు. దీంతో సినిమా నిర్మాణాన్ని శ్రీదేవి ఆపేశారు. అప్పటివరకు జరిగిన షూటింగ్‌కి దాదాపు కోటి రూపాయలు ఖర్చయింది.
అంతకుముందు శ్రీదేవితో కలిసి మోసగాడు, రాణీకాసుల రంగమ్మ వంటి సినిమాల్లో నటించారు చిరంజీవి. అయితే ఆ సినిమాల్లో చిరంజీవి నెగెటివ్ క్యారెక్టర్స్ చేశారు. వీరిద్దరూ హీరో, హీరోయిన్‌గా నటించిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత 1987లో ఈ కాంబినేషన్‌లో సినిమా నిర్మించేందుకు నిర్మాత టి.త్రివిక్రమరావు ముందుకొచ్చారు. ఎ.కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లోనే సినిమా చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే కథ సిద్ధం కాకముందే సినిమాకి కొండవీటి దొంగ అనే టైటిల్‌ని త్రివిక్రమరావు ఫిక్స్ చేశారు. ఆ టైటిల్‌కి తగ్గ కథను సిద్ధం చెయ్యమని పరుచూరి బ్రదర్స్‌కి చెప్పారు. అంతకుముందు దొంగ, అడవిదొంగ వంటి సినిమాలకు పనిచేసిన పరుచూరి బ్రదర్స్‌కి ఇది మూడో దొంగ సినిమా. నిర్మాత చెప్పినట్టుగానే మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన కథను సిద్ధం చేశారు. ఆ కథను చిరంజీవికి వినిపించారు. ఆయనకు నచ్చింది. ఆ తర్వాత శ్రీదేవికి నేరేట్ చేశారు. కథ విన్న శ్రీదేవి.. కొన్ని మార్పులు చేయాలని సూచించారు. అక్కడితో ఆగకుండా టైటిల్ కొండవీటి దొంగ కాదని, తన పాత్ర పేరు కూడా టైటిల్‌లో ఉండాలని డిమాండ్ చేశారు.
ఇదే విషయాన్ని చిరంజీవికి, త్రివిక్రమరావుకు చెప్పారు పరుచూరి బ్రదర్స్. కథలో మార్పులు చేయాలని చెప్పడం, టైటిల్‌లో తన పాత్ర పేరు కూడా ఉండాలని పట్టుపట్టడం వారికి నచ్చలేదు. దాంతో ఆ కథను పక్కన పెట్టి మరో కొత్త కాన్సెప్ట్‌తో కథను సిద్ధం చేయమని పరుచూరి బ్రదర్స్‌కి చెప్పారు. వారు చెప్పినట్టుగానే కథను రెడీ చేశారు. ఇది పూర్తిగా మాస్ కథలా ఉందని, దానికి కాస్త క్లాస్ టచ్ కూడా ఉంటే బాగుంటుందని నిర్మాత, హీరో భావించారు. అప్పుడు యండమూరి వీరేంద్రనాథ్‌ని రంగంలోకి దించారు. పరుచూరి గోపాలకృష్ణ మాస్ ఎలిమెంట్స్‌పై దృష్టి పెట్టగా, పరుచూరి వెంకటేశ్వరరావు, యండమూరి వీరేంద్రనాథ్ క్లాస్ అంశాలను జోడించారు. అలా కథలో కొత్తదనం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఈ కథలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అది కూడా అక్కా చెల్లెళ్లు. ఒకరు పోలీస్ ఆఫీసర్, మరొకరు డాక్టర్. ఆ క్యారెక్టర్ల కోసం విజయశాంతి, రాధలను ఎంపిక చేశారు.
ఈ చిత్రాన్ని చాలా రిచ్‌గా నిర్మించాలని నిర్మాత త్రివిక్రమరావు అనుకున్నారు. అందుకే 70 ఎంఎం 6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్‌తో సినిమాను నిర్మించనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు సంవత్సరం పాటు జరిగింది. రూ.2 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పటివరకు చిరంజీవి సినిమాల్లో హయ్యస్ట్ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా ఇదే. అంతకుముందు సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమాలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. 1989 సంక్రాంతికి విడుదలైన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రం కూడా ఘనవిజయం సాధించింది. దీంతో 1990 సంక్రాంతికి ‘కొండవీటి దొంగ’ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలనుకున్నారు. అయితే 70 ఎంఎం 6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం వల్ల టెక్నికల్‌గా కొన్ని అవాంతరాలు రావడంతో ఫస్ట్ కాపీ సిద్ధం కావడానికి ఆలస్యమైంది. అందుకే మార్చి 9న విడుదల చేశారు. ఈ సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మే 9న రిలీజ్ అయింది.
కొన్ని సినిమాలు విడుదలైన రోజు మొదటి షో నుంచే సూపర్‌హిట్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతాయి. మరికొన్ని మొదట డివైడ్ టాక్ వచ్చినా ఆ తర్వాత మౌత్ పబ్లిసిటీతో పుంజుకుంటాయి. కానీ, ‘కొండవీటి దొంగ’కు అలా జరగలేదు. మొదటి షోకే నెగెటివ్ టాక్ వచ్చేసింది. దానికి కారణం.. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నప్పుడు నెల్లూరు నుంచి వచ్చిన ఓ డిస్ట్రిబ్యూటర్ ఆ ఏరియాకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ వచ్చిన అతను తన అగ్రిమెంట్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు. అంతేకాకుండా సినిమా కొనవద్దని మిగతా బయ్యర్లకు చెప్పాడు. దాంతో సినిమా బాగా లేదనే న్యూస్ ట్రేడ్‌లో స్ప్రెడ్ అయిపోయింది. అందుకే ఈ సినిమాకి ఎంతో కష్టం మీద బిజినెస్ జరిగింది. నిర్మాత గట్టివాడు కావడం వల్ల అవన్నీ తట్టుకొని అనుకున్న టైమ్‌కి సినిమాను రిలీజ్ చేయగలిగారు.
రిలీజ్‌కి ముందు జరిగిన నెగెటివ్ ప్రచారం సినిమాపై ప్రభావం చూపించింది. మొదటి వారం ఫ్లాప్ అనే టాక్ వచ్చేసింది. సినిమా గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. అయినా వాటన్నింటినీ తట్టుకొని సినిమా సూపర్‌హిట్ అయింది. కథలో కొత్తదనం లేకపోయినా చిరంజీవి పెర్‌ఫార్మెన్స్, ఇద్దరు హీరోయిన్ల అందచందాలు, కోదండరామిరెడ్డి టేకింగ్, ఇళయరాజా సంగీతం, వి.ఎస్.ఆర్.స్వామి సినిమాటోగ్రఫీ, సినిమాలోని రిచ్‌నెస్.. ఇవన్నీ ‘కొండవీటి దొంగ’ చిత్రాన్ని సూపర్‌హిట్ చేశాయి. మొదటివారం రూ.74 లక్షలకుపైగా షేర్ సాధించింది. ఆ తర్వాత లాంగ్ రన్‌లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టి అప్పటివరకు చిరంజీవి నటించిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ‘కొండవీటి దొంగ’ సంచలనం సృష్టించింది. ఈ చిత్రం శతదినోత్సవాన్ని మద్రాస్‌లోని తాజ్ హోటల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకరత్న దాసరి నారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
